తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విద్యా పునరుజ్జీవన వేడుక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్, ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి, తమిళనాడు స్కూల్ విధానాలు, అక్కడి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాల గురించి వివరించారు. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు నాయకుడు కరుణానిధి స్ఫూర్తిగా నిలిచారని, విద్యా రంగంలో తమిళనాడు అత్యుత్తమ విధానాలను అవలంభించడం అభినందనీయమని తెలిపారు. తమిళనాడు అవలంభిస్తున్న బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం తన హృదయాన్ని తాకిందని, అందుకే వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.
రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా, కామరాజ్ గారు తమిళనాడులో ప్రవేశపెట్టిన విద్యావిధానం దేశంలో అనుసరిస్తోంది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు. తనను ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గర్వపడుతున్నానని, కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్, ఉదయనిధిలను అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.
విద్య రంగంపై ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు దానంగా ఇచ్చేది కాదని, నిధులు కేటాయించడం ఒక న్యాయం, ఒక హక్కు అని చెప్పారు. దేశంలో విద్య మాత్రమే సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తమిళులు, తెలుగు ప్రజల మధ్య వేల సంవత్సరాల బలమైన సంబంధాలు ఉన్నాయని, 1991 సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత తమిళనాడు తయారీ రంగంలో, తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాల్లో అభివృద్ధి సాధించాయని చెప్పారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, ప్రజారోగ్యం, సంక్షేమ పథకాల అమలులో ఇరు రాష్ట్రాల మధ్య సారూప్యత ఉందని వెల్లడించారు.
తెలంగాణలో ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, నూతన విద్యా విధానంతో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల కోసం వేర్వేరు పాఠశాలలను ఒకే గొడుగు కిందకి తేవడం ద్వారా వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.