Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం.. CBI విచారణ ప్రారంభం!

కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను వెలికితీయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించగా, స్పీకర్ అనుమతితో శాసనసభలో కూడా ఆ నిర్ణయం ఆమోదించబడింది.

ఈ క్రమంలో సీబీఐ అధికారులు ఇవాళ (గురువారం) కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణను అధికారికంగా ప్రారంభించారు. అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కోరిన దర్యాప్తు భాగంగా CBI అధికారులు NDSA, జస్టిస్ PC ఘోష్ నివేదికలను పరిశీలించారు. రికార్డుల పరిశీలన అనంతరం FIR నమోదు చేసే అవకాశముందని సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపడానికి సీబీఐ ముందుకు వచ్చింది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురిని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న నేపథ్యంలో, సీబీఐ దర్యాప్తు ప్రారంభం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply