సుజీత్ చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. సినిమా తీసేటప్పడు ఎప్పుడూ మామూలుగా ఉండడు. ‘ఓజీ’ సినిమాకు క్రెడిట్ అంతా సుజీత్కే దక్కుతుంది అని పవన్ కల్యాణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ సినిమా గురించి మాట్లాడారు. సుజీత్ విజన్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో తమన్ కూడా కీలక పాత్ర పోషించారని, ఇద్దరూ ఒకే ట్రిప్‌లో సినిమా తీశారని పవన్ చెప్పారు. “ఒక కత్తి చుట్టూ కథను అల్లుతూ రంజింపచేసేలా సినిమాను తీశారు. ‘ఖుషీ’లో ఖడ్గ ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ‘ఓజీ’ కూడా దాని చుట్టూతానే తిరుగుతుంది” అని ఆయన అన్నారు.
“రాజకీయాల్లోకి వచ్చినా అభిమానులు నన్ను వదల్లేదు. ఇప్పుడు కూడా సినిమా, రాజకీయాలు రెండింటిలో పోరాడుతున్నానంటే దానికి కారణం అభిమానులే. సినిమా చేస్తున్నప్పుడు ఈ ఒక్క ఆలోచనే నన్ను నడిపిస్తుంది” అని పవన్ అన్నారు. సుజీత్ తనకు జపనీస్ నేర్పించాడని కూడా పవన్ తెలిపారు. “ఇలాంటి డైరెక్టర్ టీమ్ నేను ‘జానీ’ చేసినప్పుడు ఉంటే, రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. తెలుగు వాడంటే ఆకాశం ఉరుముతుంది” అని పవర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మి అద్భుతంగా నటించారని, భవిష్యత్తులో మళ్లీ శ్రియారెడ్డితో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు.
ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘ఓజీ’ కాన్సెర్ట్‌లో పవన్ కల్యాణ్ కత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. ఈవెంట్ మొదలైన దగ్గర నుంచే స్టేడియం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. అయినా అభిమానుల కోసం పవన్ కల్యాణ్ సహా మొత్తం చిత్రబృందం వర్షాన్ని లెక్క చేయకుండా తడుస్తూ స్టేజ్‌పై పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం.
