ANR జయంతి ప్రత్యేకం.. అక్కినేని నాగేశ్వరరావు చిరస్మరణీయ సినీ ప్రయాణం

తెలుగు సినీ ప్రపంచంలో చిరస్మరణీయమైన నటుడు, గొప్ప మేధావి అక్కినేని నాగేశ్వరరావు.
ఎన్.టి.రామారావు వంటి మహానటుడి సమకాలంలోనూ తన ప్రత్యేకమైన శైలి, ఆలోచనా సరళి, అవగాహనతో అగ్రస్థానంలో నిలిచిన అరుదైన నటుడు ఆయన. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని, తరం మారినా తాను సృష్టించిన పాత్రలతో ఇంకా చిరంజీవిగా నిలిచిపోయారు.

దేవదాసు సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నాగేశ్వరరావు ప్రతిభను హిందీ నటుడు దిలీప్‌కుమార్ సైతం మెచ్చుకున్నాడు. “మీరు చేసిన దేవదాసును ముందే చూసుంటే నేను ఆ పాత్రను ఎప్పటికీ చేయకపోయేవాన్ని” అని ఆయన అన్న మాటలు, నాగేశ్వరరావు నటనకు ఉన్న గౌరవాన్ని తెలుపుతాయి.

నాగేశ్వరరావు తన పరిధి, ప్రతిభను స్పష్టంగా గ్రహించి తెలివితో ముందుకు సాగారు. ఘంటసాల తన గాత్రంతో పాటు మేధతో గాయకుడిగా నిలిచినట్లే, నాగేశ్వరరావు కూడా తన మేధతోనే మహానటుడిగా నిలిచారు.

మిస్సమ్మ, సుడిగుండాలు, సువర్ణసుందరి, ప్రేమాభిషేకం, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, భక్త తుకారాం, ప్రేమ నగర్, ఏడంతస్తుల మేడ, మేఘ సందేశం, అనుబంధం వంటి చిత్రాలు ఆయన నటన శిఖరాలను చూపించాయి.
ప్రత్యేకంగా సుడిగుండాలు సినిమాలో తన కొడుకు శవాన్ని చూసే సన్నివేశంలో ఆయన చూపిన హృదయవిదారకమైన నటన అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోయింది. కమల్ హాసన్ వంటి మహానటుడి నటనతో పోల్చినా, నాగేశ్వరరావు చూపిన ఆ భావవ్యక్తీకరణకు సాటి కాదు అని సినీ విమర్శకులు చెబుతారు.

సువర్ణసుందరి, ప్రేమాభిషేకం, మాయాబజార్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో ఆయన చూపిన నైజం, వైవిధ్యం మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఎన్నో వందల సినిమాల తర్వాత కూడా తన మేనరిజంలను పక్కనబెట్టి కొత్త తరహా పాత్రల్లో నటించడం, ఆయన సృజనాత్మకతకు నిదర్శనం.

అక్కినేని నాగేశ్వరరావు ఒక నటుడు మాత్రమే కాదు, ఒక చరిత్ర.
తనను తాను తెలుసుకుని, గెలుచుకుని, తెలివితో ఎదిగిన మహానటుడు. ఆయన జీవితం మనకందరికీ ఒక ప్రేరణ. ఆయన ఇచ్చిన సందేశం – “ప్రతిభతోనే కాదు, మేధతోనూ గొప్పవాడిగా నిలవాలి.”

Leave a Reply