CM Revanth: తెలంగాణకు 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్స్‌ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ ప్లాన్‌పై కూడా మాట్లాడారు.

రేవంత్ మాట్లాడుతూ, “2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం మా లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమలు, ఇన్నోవేషన్ హబ్‌లు, ఫ్యూచర్‌ రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం” అన్నారు.

హైదరాబాద్‌ మెట్రో రైలు వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమంగా ఉందని పేర్కొంటూ, దాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. త్వరలో మూసీ రివర్‌ ఫ్రంట్ కూడా రూపుదిద్దుకోనుందని వెల్లడించారు. ఆర్టీసీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని, 2027 నాటికి 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు రోడ్డెక్కుతాయని చెప్పారు.

ప్రైవేట్‌ రంగం సహకారం అవసరమని, PAFI వంటి సంస్థలు ఇలాంటి మార్గదర్శక ప్రణాళికల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. పెట్టుబడుల కోసం తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రమని, తక్కువ నిబంధనలు, సరైన ప్రణాళికలు పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణగా మారుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, దీనివల్ల కొత్త పెట్టుబడులు, యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. “ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తెలంగాణ అభివృద్ధే లక్ష్యం. గతంలో బీఆర్‌ఎస్‌, అంతకుముందు టీడీపీ, కాంగ్రెస్ కూడా అదే దిశగా పనిచేశాయి. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా అదే దిశలో ముందుకు వెళ్తోంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply