సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో కీలక భేటీ.. సినిమా పరిశ్రమ అభివృద్ధికి భారీ హామీలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చ జరిగింది.

సినిమా కార్మికుల భద్రత, శిక్షణ, ఆరోగ్య భీమా వంటి అంశాలపై సీఎం స్వయంగా ఆరా తీశారు. సమావేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి తదితర సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

హైదరాబాద్‌ను హాలీవుడ్ తరహాలో అంతర్జాతీయ స్థాయి ఫిలిం హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకురావాలని సూచించారు. అవసరమైన మద్దతు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

సినిమా రంగంలో సమ్మెలు, వాదనలు పరిశ్రమకు నష్టం కలిగిస్తాయని సీఎం హెచ్చరించారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

సినీ రంగ ఉద్యోగులు సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి కార్మికుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో అన్ని భాషల సినిమాలకు ప్రోత్సాహం అందిస్తామని, ముఖ్యంగా చిన్న సినిమాలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని సీఎం వెల్లడించారు. చిన్న, మధ్య తరహా నిర్మాతలు తెలంగాణలో షూటింగ్ చేయాలని ఉద్దేశం ఉందని చెప్పారు.

కళాకారుల గౌరవార్థం గతంలో నిలిచిపోయిన ‘గద్దర్ అవార్డులు’ను మళ్లీ ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇది ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబించే చర్య అని అన్నారు.

ప్రతి సినీ కార్మికుడికి ఆరోగ్య భీమా అందించేందుకు ప్రభుత్వం పథకం సిద్ధం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన విధివిధానాలు ప్రకటించనున్నట్లు చెప్పారు.

తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం రెండూ సమాన ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply