తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి మరో పెద్ద షాక్ ఇవ్వనున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద రావలసిన రూ.1400 కోట్లకు పైగా బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఈ అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ప్రకారం, రాష్ట్రంలోని 323 ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రూ.1400 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోతో చర్చించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన చర్చల్లో ప్రభుత్వం రూ.140 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చి, అందులో రూ.100 కోట్లు ఇప్పటికే చెల్లించింది. మిగిలిన రూ.40 కోట్లు త్వరలో ఇస్తామని చెప్పింది. అయితే ఆసుపత్రులు మాత్రం రూ.1400 కోట్లలో చిన్న మొత్తాన్ని చెల్లించడం సమస్యకు పరిష్కారం కాదని మండిపడుతున్నాయి. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) కింద ఇచ్చిన సేవలకుగానూ చెల్లింపులు లేవని ఆరోపిస్తున్నాయి.
ఇక జనవరి నెలలో కూడా ఇలాగే రూ.1100 కోట్ల బకాయిల కోసం ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. ఆ సమయంలో రెండు నెలల్లో సమస్య పరిష్కరిస్తామని ఆరోగ్యశాఖ హామీ ఇచ్చింది. ప్రతి నెలా రూ.200 కోట్లు గ్రీన్ చానెల్ ద్వారా కేటాయిస్తామని చెప్పినా, అది అమల్లోకి రాలేదు. దీంతో మరోసారి ఆసుపత్రులు ఆందోళనలోకి వెళ్లాయి.
ప్రభుత్వం స్పందించకపోవడంతో, అసోసియేషన్ మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. మంగళవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో గుండె, కిడ్నీ వంటి కీలక సమస్యలతో బాధపడుతున్న పేద రోగులకు పెద్ద సమస్యలు తలెత్తే అవకాశముంది.
