చాలామంది దూర ప్రయాణాలకు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అందుకే ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకొని రిజర్వేషన్లు చేసుకుంటారు. తాజాగా రైల్వే బోర్డు రిజర్వేషన్ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది.
ఇకనుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ కార్డు అథెంటికేషన్ తప్పనిసరి అవుతుంది. మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్‌తో వెరిఫై అయిన వినియోగదారులు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ విధానం తత్కాల్ టికెట్లకు మాత్రమే అమల్లో ఉంది. అయితే అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా ఇది వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం ఏదైనా ట్రైన్‌కు 60 రోజుల ముందే టికెట్ రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ తత్కాల్ బుకింగ్ లాగా, సాధారణ రిజర్వేషన్ ప్రారంభమైన వెంటనే కొందరు కేటుగాళ్లు సాఫ్ట్‌వేర్ సాయంతో టికెట్లు బుక్ చేస్తున్నారు. దీని వల్ల సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు.
అందుకే రైల్వే బోర్డు ఈ కొత్త ఆథెంటికేషన్ విధానం ద్వారా సాధారణ ప్రయాణికులకు ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. అన్ని జోనల్ కార్యాలయాలకు దీనిపై సమాచారం అందించబడింది. అయితే, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు.