Saree Offer: బతుకమ్మ బంపర్ ఆఫర్‌.. మెదక్‌లో రూ.99కే చీరల కోసం ఎగబడ్డ మహిళలు!

బతుకమ్మ పండుగ సందర్బంగా మెదక్ జిల్లా తుప్రాన్‌లోని ఓ షాపింగ్ మాల్ సంచలన ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.99కే చీరలు అందుబాటులో ఉన్నాయని తెలియడంతో మహిళలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా మాల్ మొత్తం మహిళలతో కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ మహిళలకు బతుకమ్మ అంటే ప్రత్యేకమైన పండుగ. ఈ వేడుకల ముందు కొత్త చీరలు కొనడం సంప్రదాయంగా మారింది. అలాంటిది తక్కువ ధర ఆఫర్ వస్తే మరి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నెల రోజుల ముందుగానే బతుకమ్మ కోసం షాపింగ్ మాల్స్ నిండిపోతుంటే, రూ.99కే చీరల ఆఫర్ మహిళలను మరింత ఆకర్షించింది.

చీర ఆఫర్ వార్త విన్న చుట్టుపక్కల గ్రామాల మహిళలు కూడా తుప్రాన్ మాల్‌కు వచ్చేశారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో మాల్‌లో తొక్కిసలాట జరిగే పరిస్థితి నెలకొంది. అంతేకాదు మాల్ బయట భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

స్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి మహిళలను బ్యాచ్‌ల వారీగా లోపలికి అనుమతించారు. ఆఫర్ కారణంగా మాల్ చుట్టుపక్కల కిక్కిరిసిన జనంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Leave a Reply