Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. తొలి మ్యాచ్‌లో ఘన విజయం

ఆసియా కప్ 2025లో భారత జట్టు శుభారంభం చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 4.3 ఓవర్లలో యూఏఈ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు అలవోకగా చేధించారు.

మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒకే వికెట్ కోల్పోయి టార్గెట్‌ను సులభంగా చేరుకుంది. ఓపెనర్లుగా దిగిన అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (20*; 9 బంతుల్లో 1 సిక్స్‌, 2 ఫోర్లు) చెలరేగారు. 3.5 ఓవర్లో అభిషేక్ అవుట్ కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (7*) వచ్చి మ్యాచ్‌ను పూర్తి చేశాడు.

యూఏఈ జట్టులో ఓపెనర్ అలీషాన్ షరాఫు (22), కెప్టెన్ మహమ్మద్ వసీమ్ (19) తప్ప మిగతా బ్యాటర్లు డబుల్ డిజిట్‌లోకీ చేరలేకపోయారు. తొలి మూడు ఓవర్లలో దూకుడు చూపిన యూఏఈ ఆటగాళ్లు, భారత్ బౌలింగ్ దాడి ముందు చేతులెత్తేశారు.

భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో మెరిశాడు. శివమ్ దూబే 3 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.

ఈ విజయంతో భారత్ తన తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించింది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ పోరు జరగనుంది.

Leave a Reply