రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. TGSRTCలో ‘యాత్రాదానం’ వినూత్న కార్యక్రమం ప్రారంభం

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం శుభకార్యాల రోజుల్లో అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం.

దీనికి అవసరమైన సౌకర్యాలను TGSRTC అందించనుంది. దాతలు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు వంటి ప్రత్యేక రోజుల్లో విరాళం అందజేస్తే, ఆ మొత్తంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఈ సేవను అందిస్తుంది.

తాజాగా ఈ ‘యాత్రాదానం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశారు.

ఈ పథకంలో వ్యక్తులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, అసోసియేషన్స్, ఎన్జీవోలు కూడా స్పాన్సర్ చేయవచ్చు. ఇలా చేస్తే నిరుపేదలకు సంతోషకరమైన రోజుల్లో విహారయాత్రలు చేయించే అవకాశం ఉంటుంది.

దీనికోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కవర్ చేసే ఈ టూర్లలో ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్రారంభానికి కనీసం వారం రోజుల ముందు బస్సులను రిజర్వ్ చేసుకోవాలి.

దాతలు సమీపంలోని ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ హెల్ప్‌లైన్ నంబర్లు 040 69440000 / 040 23450033 ను సంప్రదించవచ్చు.

Leave a Reply