Little Hearts : నాని ప్రశంసలు అందుకున్న ‘లిటిల్ హార్ట్స్’.. థియేటర్లలో హిట్ టాక్!

ఈటీవీ విన్ నుంచి థియేటర్లలోకి వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫుల్ కామెడీతో, ఎమోషన్‌తో నిండిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలుస్తోంది. విడుదలైనప్పటి నుంచి యూత్ మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు.

ఈటీవీ విన్ (ETV Win) ఇప్పటివరకు ఓటీటీ కంటెంట్‌కి మాత్రమే పరిమితమై ఉండగా, థియేటర్ల దిశగా అడుగు పెట్టిన తొలి ప్రాజెక్ట్‌ ఇదే. థియేటర్ రిలీజ్‌గా వచ్చిన ఈ ప్రయోగం బాగా వర్కౌట్ అయింది.

సాయిమార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించారు. విడుదల తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్‌ కారణంగా సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది.

ఇక తాజాగా హీరో నాని, దర్శకుడు సాయి రాజేశ్, టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవింత్ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

నాని మాట్లాడుతూ.. “సినిమా చూస్తున్నంతసేపూ ఎంత నవ్వానో చెప్పలేను. చాలా రోజుల తర్వాత ఇలా మనస్ఫూర్తిగా నవ్వాను. అఖిల్, మధు, కాత్యాయిని – మీ ముగ్గురూ నా రోజు మొత్తాన్ని నవ్వులతో నింపారు. థాంక్యూ చెప్పటమే కాదు, మీ పనిని నిజంగా మెచ్చుకుంటున్నాను.” అని అన్నారు.

“బేబీ” ఫేమ్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “కంటెంట్ ఎప్పుడూ కింగ్ అని మరోసారి ఈ సినిమా నిరూపించింది. మొదటి నుండి చివరి వరకు నవ్వులే. ఒక్క క్షణం కూడా నవ్వు ఆగదు. ప్రతి రెండేళ్లకో మూడేళ్లకో ఎవరో ఒకరు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారు. ఈసారి ఆ అవకాశం లిటిల్ హార్ట్స్దే,” అన్నారు.

టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ అభిషన్ జీవింత్ మాట్లాడుతూ.. “ఇది మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూసే అందమైన సినిమా. మొదటి నుండి చివరి వరకు హాస్యమే. థియేటర్‌లో మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా,” అని తన అభిప్రాయం చెప్పారు.

చిన్న సినిమాగా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించి, థియేటర్లలో హిట్ టాక్‌తో ముందుకు సాగుతోంది.

Leave a Reply