Panchayat Sarpanch : దొంగతనంలో కిక్కే వేరట.. బయటపడ్డ సర్పంచ్ భాగోతం!

చెన్నైలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ 5 తులాల బంగారు గొలుసు దొంగతనానికి గురైంది. విచారణలో ఈ చోరీ చేసినది మరెవరో కాదు.. నరియంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతి అని పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. భారతి అధికార డీఎంకే నాయకురాలు కావడం.

వివరాల్లోకి వెళ్తే.. నేర్కుండ్రం నివాసి వరలక్ష్మి (50) కాంచీపురం లోని ఒక వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యింది. వేడుక పూర్తయ్యాక బస్సులో ఇంటికి తిరుగు ప్రయాణం అయింది. తన గ్రామం రాగానే దిగి, ఇంటికి వెళ్లి చూసుకుంటే తన 5 తులాల గొలుసు కనిపించలేదు. వెంటనే కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తులో పోలీసులు బంగారం దొంగిలించింది వరలక్ష్మి పక్కన కూర్చున్న మహిళేనని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత షాకింగ్ నిజం బయటపడింది. ఆమె తిరుపత్తూరు జిల్లాలోని నరియంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతి (56) అని, అంతేకాక డీఎంకే కార్యకర్త అని తెలిసింది. ప్రజాసేవలో ఉన్న ఓ సర్పంచ్ ఇలాంటి పనికి పాల్పడడం పోలీసులు, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదే కాకుండా, ఆమెపై గతంలో కూడా తిరుపత్తూరు, వెల్లూరు, అంబూరు ప్రాంతాల్లో పలు దొంగతన కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో భారతి సంచలన వ్యాఖ్యలు చేసింది. దొంగతనాలతో వచ్చే “కిక్కే వేరు” అని, 15 ఏళ్లుగా ఇదే కారణంతో దొంగతనాలు చేస్తూ వస్తున్నట్లు అంగీకరించింది. డబ్బు, పలుకుబడి ఉన్నా.. దొంగతనం చేసినప్పుడు వచ్చే ఆనందం వేరే అని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

Leave a Reply