ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవం పనులు ఈ రోజు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టిన గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్-2, 3 కు శంకుస్థాపన చేయనున్నారు. దీనిద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను మంచినీటితో నింపే ప్రణాళిక ఉంది.
అదేవిధంగా, ఓఆర్ఆర్ ఫేజ్-2 పరిధిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన 15 కొత్త రిజర్వాయర్లను కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (HAM) విధానంలో అమలు కానుంది. ఇందులో ప్రభుత్వం 40% నిధులు పెట్టగా, కాంట్రాక్ట్ సంస్థ 60% సమకూర్చనుంది.
ప్రాజెక్టు పనులు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఇందులో 2.5 టీఎంసీలు మూసీ పునరుజ్జీవానికి, మిగతా 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. మార్గం మధ్యలోని చెరువులు కూడా ఈ నీటితో నిండనున్నాయి. 2027 నాటికి హైదరాబాద్‌కు ప్రతిరోజూ నల్లా నీరు సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
ఇక రూ.1,200 కోట్లతో నిర్మించిన ఓఆర్ఆర్ ఫేజ్-2 తాగునీటి ప్రాజెక్టులో భాగంగా మొత్తం 71 రిజర్వాయర్లలో 15 రిజర్వాయర్లను సీఎం ఈ రోజు ప్రారంభించనున్నారు. వీటి ద్వారా 14 మండలాల్లోని సుమారు 25 లక్షల మందికి తాగునీరు అందనుంది.
అదే విధంగా, కోకాపేట నియోపోలిస్ సెజ్‌లో తాగునీరు, మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.298 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులు కూడా రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
