Asia Cup 2025 : చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు.. ఆసియా కప్ 2025లో అద్భుత విజయం

భారత పురుషుల హాకీ జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించి, టైటిల్‌ను దక్కించుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న హాకీ వరల్డ్ కప్ కు భారత్ నేరుగా అర్హత సాధించింది.

బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ ఆరంభంలోనే సుఖ్‌జీత్ సింగ్ గోల్‌తో భారత్ ముందంజ వేసింది. జుగ్ రాజ్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ మిస్ చేసినప్పటికీ భారత్ ఒత్తిడిని కొనసాగించింది. అర్థభాగం ముగిసేలోపే దిల్ ప్రీత్ సింగ్ మరో గోల్ చేసి స్కోర్‌ను 2-0కి తీసుకెళ్లాడు.

మూడో క్వార్టర్‌లో రాజేందర్ గోల్‌తో భారత్ 3-0 ఆధిక్యం సాధించగా, చివరి క్వార్టర్‌లో అమిత్ రోహిదాస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 4-0 స్కోర్‌ చేశాడు. చివరి నిమిషాల్లో సౌత్ కొరియా ఒక గోల్ చేసినా భారత్ విజయం ఖాయం అయింది.

ఈ విజయంతో భారత్ తన నాలుగవ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇంతకుముందు 2003, 2007, 2017లో ఈ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. టోర్నమెంట్ మొత్తం అజేయంగా నిలిచిన భారత జట్టు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా ఫైనల్‌లో మెరిసిన దిల్ ప్రీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం భారత హాకీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

Leave a Reply