Little Hearts : చిన్న సినిమా భారీ హిట్.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘లిటిల్ హార్ట్స్’!

చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోలు లేకపోయినా, భారీ బడ్జెట్ లేకపోయినా.. కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి రుజువుచేసింది.

సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రంలో సోషల్ మీడియా ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించగా, యువత నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఘాటీ, మదరాశి వంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి, బాక్సాఫీస్ వద్ద సత్తాచాటుతోంది. విడుదలైన తొలి రోజే రూ. 1.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, రెండో రోజు వసూళ్లు పెరిగి రూ. 3 కోట్లకు చేరాయి.

కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ముఖ్యంగా USAలో $171K (సుమారు రూ. 1.4 కోట్లు) రాబట్టింది.

అయితే అదే రోజు విడుదలైన స్టార్ హీరోయిన్ అనుష్క ఘాటీ మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, మొదటి రోజు రూ. 2.36 కోట్లతో పూర్ ఓపెనింగ్స్ సాధించగా, రెండవ రోజు వసూళ్లు రూ. 1.8 కోట్లకు పడిపోయాయి. నెగటివ్ రివ్యూలు, మౌత్‌టాక్ కారణంగా ఈ సినిమా కష్టాల్లో పడింది.

ఇక శివకార్తికేయన్ నటించిన మదరాశి కూడా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోతోంది. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైనప్పటికీ, మొదటి రోజు రూ. 1.8 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. రెండవ రోజు మరింత తగ్గిపోయింది.

మొత్తం గా లిటిల్ హార్ట్స్ సినిమా చిన్నదే అయినా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని దూసుకెళ్తోంది.

Leave a Reply