CM Revanth Reddy : కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన రియాక్షన్..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ కీలక నేతలపై చేసిన సంచలన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “వాళ్లని వాళ్లే కడుపులో కత్తులతో కౌగిలించుకుంటున్నారని” అంటూ ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వేములలో జరిగిన SGD-కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

కవిత చేసిన ఆరోపణలు.. సంతోష్ రావు, హరీశ్ రావులపై ఉండగా, వాటిపై స్పందించిన సీఎం రేవంత్ కుటుంబ తగాదాల్లో తనను లాగొద్దని స్పష్టం చేశారు. “నేను ఎవరి వెనక ఉండను.. ప్రజల ముందే ఉంటా. అవినీతి సొమ్ము కోసం కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వచ్చాయి. పాపం ఊరికే పోదు.. చేసుకున్నవారికి చేసుకున్నంత వస్తుంది” అంటూ విమర్శించారు.

బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతుందని సీఎం అన్నారు. “కుటుంబ గొడవలతో పార్టీ లోపలే తన్నుకుంటున్నారు. దాంట్లో మాకు సంబంధం లేదు. మమ్మల్ని లాగొద్దు” అని స్పష్టం చేశారు.

అలాగే కాంగ్రెస్ పార్టీని బతకనివ్వకుండా గతంలో తాను ఎమ్మెల్యే కాకముందే అక్రమ కేసులు పెట్టారని గుర్తుచేసుకున్నారు. “ఇవాళ వాళ్లే ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు వస్తున్నాయి. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

“హరీశ్, సంతోష్ వెనక రేవంత్ ఉన్నాడని అంటున్నారు.. ఇంకొందరు కవిత వెనక రేవంత్ ఉన్నాడని అంటున్నారు. అంత చెత్త వాళ్ల వెనక నేను ఎందుకు ఉంటా? నేను నాయకుడిని, ఉంటే ముందుంటా. తెలంగాణ ప్రజలు చీదరించుకున్న మీ వెనక ఎవరైనా ఉంటారా?” అని ప్రశ్నించారు.

కుటుంబ పంచాయతీలలో, కుల పంచాయతీలలో మమ్మల్ని లాగొద్దని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Leave a Reply