Amit Shah : గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్‌ షా.. హైదరాబాద్‌లో హై అలర్ట్

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకోనున్నారు. ముందుగా ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై, అనంతరం చార్మినార్ వద్ద జరిగే గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద సభలో ప్రసంగించనున్నారు.

అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెట్రో రైళ్లకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు.

ఇక, చంద్రగ్రహణం నేపథ్యంలో నిమజ్జనంపై సందేహాలు వ్యక్తం కావడంతో గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టతనిచ్చింది. సెప్టెంబర్ 6ననే నిమజ్జనం జరగనుందని స్పష్టం చేసింది. అయితే వరుస వర్షాల కారణంగా మండప నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ట్యాంక్‌బండ్ సహా 74 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటిలో 27 పర్మినెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరరీ పాండ్స్ ఉన్నాయి.

జీహెచ్ఎంసీ దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్ వద్ద క్రేన్లను ఏర్పాటు చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అమిత్‌ షా శోభాయాత్రలో పాల్గొనడం వల్ల ఈసారి జనసంచారం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. అందుకే ప్రభుత్వం, పోలీసులు, జీహెచ్ఎంసీ ముందస్తు ఏర్పాట్లు చేసి హై అలర్ట్ ప్రకటించారు.

Leave a Reply