కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, అంతరాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర కారణాలను పరిగణనలోకి తీసుకుని కేసును సీబీఐకి అప్పగించడం సముచితం అని తెలిపారు.
ప్రత్యేకంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రూపకల్పన, నిర్మాణంలో NDSA గుర్తించిన లోపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చల అనంతరం సభ ఏకగ్రీవంగా సీబీఐ దర్యాప్తుకు ఆమోదం తెలిపింది. నిజాయితీగా విచారణ జరగాలని ఆశిస్తున్నానని సీఎం రేవంత్ అన్నారు. అనంతరం రాత్రి 1.45 గంటలకు సభ నిరవధికంగా వాయిదా పడింది.
మొదట రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ లేదా సిట్ ద్వారా విచారణ చేపడుతుందని చాలామంది అనుకున్నారు. కానీ మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటే రాజకీయంగా కక్షపూరితంగా మారుతుందనే విమర్శలు రాకుండా ఉండేందుకు కేసును నేరుగా సీబీఐకి అప్పగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/nA8SkSSrHy
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2025
అంతకుముందు కమిషన్ నివేదికపై అసెంబ్లీలో సీఎం రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య గట్టి వాదోపవాదాలు జరిగాయి. తుమ్మిడిహట్టి వద్ద నీరు అందుబాటులో ఉన్నా, కేసీఆర్-హరీశ్‌లు ప్రాజెక్టు స్థలాన్ని మార్చి దోపిడీ చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదని, కేవలం ఎత్తు తగ్గించాలని మాత్రమే సూచించిందని ఆయన స్పష్టం చేశారు.
అయితే పోలవరం ప్రాజెక్టు పదిసార్లు దెబ్బతిన్నా, అక్కడ విచారణ ఎందుకు జరపలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. పోలవరం డ్యామ్ మరమ్మతులకు రూ.7 వేల కోట్లు అవసరమని చెప్పి, అదే సమయంలో అక్కడ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ ఇప్పుడు మేడిగడ్డపై రిపోర్ట్ ఎలా ఇస్తారని నిలదీశారు. NDSAకు ఒకే తరహా నీతి ఉండదా అని హరీశ్ మండిపడ్డారు.