RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ పరేడ్‌లో జరిగిన దుర్ఘటన అందరినీ కలచివేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

దాదాపు 18 ఏళ్ల తర్వాత IPL టైటిల్‌ను గెలుచుకున్న ఆనందంలో ఆర్సీబీ జట్టు సంబరాలు జరుపుకుంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అభిమానులు భారీ ఎత్తున స్టేడియానికి చేరుకోవడంతో నియంత్రణ కోల్పోయి తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనకు మూడునెలలు దాటినా తాజాగా ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసినట్లు అధికారిక సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు తెలిపింది.

“జూన్ 4న మా హృదయాలు బద్ధలయ్యాయి. ఆర్సీబీ కుటుంబంలోని 11 మంది అభిమానులను కోల్పోయాం. వారు మన జట్టు, మన నగరం, మన సమాజంలో భాగమే. వారి గైర్హాజరీ ఎప్పటికీ పూడ్చలేని లోటు. అయినా మొదటి అడుగుగా, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేశాం. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, కరుణ, ఐక్యత, నిరంతర సంరక్షణకు ప్రతీక” అని ఆర్సీబీ పేర్కొంది.

Leave a Reply