ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. వచ్చే నెల 13న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లో బ్రాంకో టెస్ట్ ద్వారా అతని ఫిట్‌నెస్‌ను బీసీసీఐ పరిశీలించనుంది. ఈ టెస్ట్ యోయో టెస్ట్ కంటే మరింత కఠినమైనదిగా భావిస్తున్నారు.
మే చివర్లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత రోహిత్ శర్మ మళ్లీ ఎటువంటి మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినందువల్ల ఇంగ్లాండ్ టూర్‌కు కూడా వెళ్లలేదు. దాంతో మే నుండి పూర్తిగా విశ్రాంతిలో ఉన్న రోహిత్, ఇప్పుడు అక్టోబర్‌లో జరిగే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతని ఫిట్‌నెస్ లెవెల్స్‌ను నిర్ధారించడానికి బీసీసీఐ ఈ పరీక్షను తప్పనిసరి చేసింది.
యోయో కంటే కఠినమైన బ్రాంకో
భారత క్రికెటర్లకు ఇప్పటివరకు ఫిట్‌నెస్ అంచనాల కోసం యోయో టెస్ట్‌ను నిర్వహించేవారు. కానీ ఇప్పుడు బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆటగాళ్లు ఎత్తైన ప్రదేశాల్లో పరుగెత్తాల్సి ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా లభించే పరిస్థితుల్లో ఈ పరీక్ష చాలా కఠినంగా మారుతుంది. అందువల్ల ఇది యోయో టెస్ట్ కంటే గట్టిదిగా అనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ టెస్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎత్తైన కొండలపై పరుగెత్తడం వల్ల ఊపిరితిత్తులపై అధిక ఒత్తిడి పడుతుందని, దీని వలన ఆటగాళ్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డాడు.