నిరుద్యోగులకు శుభవార్త.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. 25 వేల ఉద్యోగాలు!

ఐటీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలోని మధురవాడలో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఉండే ఈ సెంటర్ కోసం గూగుల్ దాదాపు ₹50 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేసే అతి పెద్ద కేంద్రాలలో ఇది ఒకటి కావడం విశేషం.

ఈ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా సోషల్ మీడియాలో స్పందించింది. గూగుల్ డేటా సెంటర్ దేశానికి ప్రపంచ డిజిటల్ హబ్‌గా గుర్తింపు తెస్తుందని పేర్కొంది. దీని ద్వారా విశాఖపట్నం డిజిటల్ రంగంలో ప్రధాన కేంద్రంగా ఎదగనుంది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సేవలకు ఈ డేటా సెంటర్ కీలకంగా మారనుంది.

ఇకపై దేశంలోనే డేటా నిల్వ ఉండటంతో డేటా భద్రత పెరుగుతుంది. అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్ కోసం మూడు సబ్‌మెరైన్ కేబుల్స్‌కు ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ముంబైలో గూగుల్ పియరింగ్, క్యాచీ సర్వర్లు ఉన్నాయి. కూలింగ్ కోసం ఎక్కువ నీటి అవసరం ఉండటంతోనే బీచ్ ఉన్న విశాఖను గూగుల్ ఎంచుకుంది.

ఈ డేటా సెంటర్‌తో ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరో 50 వేల మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply