Smita Sabharwal : IAS స్మితా సబర్వాల్‌ సంచలన నిర్ణయం.. ఆరునెలల చైల్డ్ కేర్ లీవ్

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆమె, ఆరునెలల పాటు చైల్డ్ కేర్ లీవ్‌లో వెళ్తున్నట్లు సమాచారం. ఆగష్టు 1 నుంచి జనవరి 31 వరకు ఆమె లీవులో ఉండనున్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాకమిటీలో సభ్యురాలిగా, అలాగే మిషన్‌ భగీరథ ప్రాజెక్టులో కీలక భూమిక పోషించిన స్మితా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ప్రాధాన్యం తగ్గిందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న ఆమె స్థానంలో కాత్యాయని దేవిని నియమించినట్లు సమాచారం.

గతంలో ముఖ్యమైన పదవులు దక్కిన స్మితాకు, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వరుస బదిలీలతో పాటు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా, తర్వాత యువజనాభివృద్ధి, పర్యాటక & సంస్కృతి శాఖ కార్యదర్శిగా, ఆపై మళ్లీ ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా నియమించడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇకపై స్మితా సబర్వాల్‌ భవిష్యత్‌ నిర్ణయమేంటన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో HCU భూముల వివాదంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్‌ చేయడం, మిషన్‌ భగీరథలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వంటివి ఆమెపై చర్చనీయాంశాలుగా మారాయి. ఈ ఆరునెలల లీవు ముగిసిన తర్వాత ఆమె తిరిగి జాయిన్‌ అవుతారా, లేక మరింత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.

Leave a Reply