దేశవ్యాప్తంగా వినాయక చవితి (Vinayaka Chavithi 2025) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక ఆనందాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊపునిస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తాజా అంచనాల ప్రకారం, ఈ ఏడాది గణేశోత్సవాల సందర్భంగా సుమారు రూ.28,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు.
ముఖ్యంగా వ్యాపారులు ఈసారి విదేశీ ఉత్పత్తులను పక్కన పెట్టి స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వినియోగదారులనూ అదే దిశగా ప్రోత్సహిస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో ఈ పండుగ వాణిజ్యానికి కొత్త ఊపునిస్తోంది.
కోట్లలో వ్యాపారం..
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా వినాయక మండపాలు ఏర్పాటు అయ్యాయి. ఒక్కో మండపానికి కనీసం రూ.50,000 ఖర్చు అవుతుందని లెక్కేస్తే, కేవలం మండపాలపైనే సుమారు రూ.10,500 కోట్లు వెచ్చించబడుతున్నాయి.
వినాయక విగ్రహాల వ్యాపారం మాత్రమే రూ.600 కోట్లకు పైగా ఉందని అంచనా.
పూజా సామాగ్రి (పూలు, కొబ్బరికాయలు, పండ్లు, అగర్‌బత్తులు మొదలైనవి) రూ.500 కోట్లకు పైగా అమ్ముడవుతున్నాయి.
మోదకాలు, లడ్డూలు, ఇతర మిఠాయిలు సుమారు రూ.2,000 కోట్ల మార్కెట్‌ను అందుకుంటున్నాయి.
క్యాటరింగ్ రంగం టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరింది.
దుస్తులు, అలంకరణ వస్తువులు, రిటైల్ అమ్మకాలు రూ.3,000 కోట్ల వరకు చేరుతున్నాయి.
గణపతి మండపాలు ఆధునికతను సంతరించుకోవడంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగానికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీని వల్ల సుమారు రూ.5,000 కోట్ల వ్యాపారం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఆభరణాల అమ్మకాలు రూ.1,000 కోట్లకు చేరుకోగా, గణేశ్ మండపాలకు భీమా చేయించుకునే ట్రెండ్ పెరిగింది. దీని ద్వారా ఇన్సూరెన్స్ రంగంకే రూ.1,000 కోట్ల వరకు లాభం వస్తుందని అంచనా.
మొత్తం మీద, వినాయక చవితి పండుగ ఆధ్యాత్మిక వాతావరణం మధ్య దేశ వ్యాపార రంగానికి ఊపునిస్తూ, భారీ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరగడానికి కారణమవుతోంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.