Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం!

హైదరాబాద్ ఆఘపురలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. అయితే అందులో సాధారణ వినాయకుడి విగ్రహాన్ని కాకుండా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఈ విగ్రహం బయటపడగానే భక్తుల్లో ఆగ్రహం మొదలైంది. “దేవుడి రూపంలో కాకుండా ఒక రాజకీయ నాయకుడి గెటప్‌లో విగ్రహం ప్రతిష్టించడం హిందూ మనోభావాలను దెబ్బతీస్తోంది” అంటూ పలువురు భక్తులు మండిపడ్డారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి చర్యలు హిందూ సమాజాన్ని అవమానపరచడమేనని, వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలని పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. “వినాయకుడి రూపంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం సరికాదు. హిందువుల విశ్వాసాలను కించపరచకూడదు” అని రాజాసింగ్ స్పష్టంగా హెచ్చరించారు.

అదేవిధంగా స్థానిక భక్తులు కూడా మండిపడి, వెంటనే ఆ వినాయకుడిని నిమజ్జనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై విభిన్న వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని ఒక అభిమాని చేసిన అతి ఉత్సాహంగా చూస్తే, మరికొందరు దీన్ని హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.

ఈ సంఘటనతో సీఎం రేవంత్ రెడ్డి పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారగా, ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందనతో వివాదం మరింత వేడెక్కింది.

Leave a Reply