బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9 Telugu) త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ప్రతిసారీ కొత్త కంటెంట్, ఆసక్తికరమైన మార్పులతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఈసారి కూడా షోలో నూతన మార్పులు, కొత్త ఎంట్రీలు ఉండనున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించనుండటం హాట్ టాపిక్‌గా మారింది. టాస్క్‌లలో గెలిచిన వారికి బిగ్ బాస్ హౌస్‌లో ప్రవేశం కల్పించనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన శ్రష్ఠి, కొంతకాలం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్రష్ఠి వర్మ ఇప్పటికే పలు సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేసి బిజీగా మారింది. ముఖ్యంగా గతేడాది విడుదలైన పుష్ప 2లో కొన్ని పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసి తన ప్రతిభను చూపించారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందా? లేదా? అనేది షో ప్రారంభం అయ్యే వరకు సస్పెన్స్‌గానే మిగిలిపోనుంది.
బిగ్ బాస్ మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జునే ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. తొలుత ఈ సీజన్‌ను బాలకృష్ణ హోస్ట్ చేస్తారని రూమర్స్ వినిపించినా, తాజాగా విడుదలైన వీడియోలో నాగార్జునే ఈ సీజన్‌కు హోస్ట్‌గా కొనసాగుతున్నట్లు బిగ్ బాస్ టీం క్లారిటీ ఇచ్చింది.
త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 9 కోసం అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.