ChikithaTaniparthi: ‘చికిత’ దేశానికే గర్వకారణం.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు

కెనడాలో జరిగిన ప్రపంచ యువజన ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తి (Chikitha Taniparthi) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందించారు. ఈ మేరకు మంగళవారం సీఎంవో కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఆర్చరీ అండర్-21 ఫైనల్లో కొరియాకు చెందిన పార్క్ యెరిన్‌పై విజయం సాధించిన చికిత, వరల్డ్ చాంపియన్‌గా నిలవడం దేశానికే గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆటుపోట్లను అధిగమించి, గ్రామీణ ప్రాంతం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రపంచ స్థాయి పోటీలో విజయం సాధించడం యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. భవిష్యత్తులో చికిత మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, చిన్ననాటి నుంచే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులను కూడా సీఎం అభినందించారు.

అలాగే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కూడా ఎక్స్ వేదికగా చికితకు శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా భారత్ ప్రతిష్టను, తెలంగాణ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని కవిత కొనియడారు. సుల్తాన్‌పూర్ గ్రామం నుంచి ప్రపంచస్థాయి పోటీలో దేశానికి తొలి బంగారు పతకం అందించడం అనేకమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో చికిత మరిన్ని బంగారు పతకాలు సాధించి మనందరికీ గర్వకారణంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply