తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు నుండి ఐదు రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. అంతకు ముందు రోజు, 29న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
సమావేశాల మొదటి రోజు, జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానం చేస్తారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని సంతాపం తెలియజేయనున్నారు. ఈ సమావేశాల్లో ఉపసభాపతి ఎంపిక కూడా జరగనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీపీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించే అవకాశం ఉంది.
బడ్జెట్ సమావేశాల తర్వాత గవర్నర్ శాసనసభను ప్రోరోగ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ ఆదేశాలను రద్దు చేసి అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఈ సమావేశాలు రాజకీయ వాదనలతో ఉత్కంఠభరితంగా ఉండనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్య వాదోపవాదాలు తీవ్రంగా జరిగే అవకాశం ఉంది. అంతేకాక, బీజేపీ “మార్వాడీ గోబ్యాక్” వివాదాన్ని శాసనసభలో లేవనెత్తనుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ దాడులు చేసే అవకాశం ఉంది.
ఇక బీఆర్‌ఎస్ నేతలు, నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి సురేఖ–సమంత–కేటీఆర్ వివాదం వంటి అంశాలను కాంగ్రెస్ కావాలనే సృష్టించిందని విమర్శిస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించిన నేపథ్యంలో సభలో వేడి చర్చలు తప్పకుండానే కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్, కాళేశ్వరం అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లి బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలని యోచిస్తుండగా, బీఆర్‌ఎస్ కూడా దీనిపై తగిన సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు 42% బీసీ రిజర్వేషన్లు, ఎరువుల కొరత వంటి సమస్యలపై కాంగ్రెస్‌ను నిలదీయడానికి బీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తోంది.
మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు దిశానిర్దేశం చేయవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.