ప్రొఫెసర్ కోదండరాం (Prof. Kodandaram) కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు కొందరు సుప్రీంకోర్టు (Supreme Court) కు వెళ్లి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేం పైశాచిక ఆనందం?” అని ప్రశ్నించారు.
ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం రేవంత్, కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని, 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇదేనని అన్నారు.
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి అందరూ ఉస్మానియా విద్యార్థులేనని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాల్లో ఈ యూనివర్సిటీ కీలకపాత్ర పోషించిందని, మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి, అలాగే యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఈ నేలకే చెందినవారని అన్నారు.
గత 10 ఏళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వీసీల నియామకాలు చేసి, పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు ప్రారంభించామని తెలిపారు. “దేశంలో 60% మంది 35 ఏళ్ల లోపు వారే.. 21 ఏళ్లకే IAS అవుతుంటే, శాసనసభలో అడుగుపెట్టలేరా?” అని ప్రశ్నించారు.
“నా దగ్గర పంచడానికి భూములు, ఖజానా లేవు. కానీ నేను ఇవ్వగలిగింది చదువే. చదువే మీ భవిష్యత్తు మార్చగలదు, ధనవంతుల్ని, గుణవంతుల్ని చేస్తుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. “యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో చెప్పండి, అంచనాలు సిద్ధం చేసి ఇవ్వండి. మళ్లీ వస్తాను. ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తాను. ఆ రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కూడా కనిపించకూడదు” అని ఆదేశించారు.
“ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదు. ఇది చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.