Crime: కట్నం కోసం తిండి పెట్టకుండా హింసించి.. చివరికి దారుణం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ విషాదకర ఘటన వెలుగుచూసింది. అదనపు కట్నం కోసం భార్యను హింసిస్తూ, తిండి కూడా పెట్టకుండా చివరికి చంపేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

ఇటీవల పెళ్లిళ్లలో కట్నం కోసం వేధింపులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రసన్న అనే మహిళ అదనపు కట్నం కోసం అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది.

ఏం జరిగింది?

రెండేళ్లుగా తల్లిదండ్రులు కూతురిని చూడలేకపోయారు. ఫోన్ చేసినా మాట్లాడనివ్వలేదు. చివరకు అల్లుడు ఫోన్ చేసి “మీ అమ్మాయి మెట్లపై నుంచి పడిపోయింది, ఆస్పత్రిలో ఉంది” అని చెప్పాడు. వెంటనే పరుగుపరుగున చేరుకున్న తల్లిదండ్రులు తమ కూతురిని చూసి షాక్ అయ్యారు. చలాకీగా ఉండే తమ కూతురు అస్థిపంజరంలా మారి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది.

తండ్రి, తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘తిండి పెట్టకుండా, హింసిస్తూ చంపేశాడు’’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల వివరాలు

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథంపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న 10 ఏళ్ల క్రితం పూల నరేశ్ బాబును వివాహం చేసుకుంది. మొదట్లో అన్నీ బాగానే ఉన్నా, తరువాత కట్నం కోసం ఇబ్బందులు మొదలయ్యాయి. శనివారం భర్త సురేష్ బాబు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని చెప్పాడు. అయితే ఆస్పత్రిలో చూసిన దృశ్యం తల్లిదండ్రులను కలచివేసింది.

ప్రసన్న తల్లిదండ్రులు వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారం, రెండు ఎకరాల మామిడితోట, అర ఎకరం పొలం కట్నంగా ఇచ్చామని పేర్కొన్నారు. అయినా కూడా అదనపు కట్నం కోసం తమ కూతురిని హింసించి చంపేశారని ఆరోపించారు.

కేసు నమోదు
ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply