Cheteshwar Pujara :క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన చతేశ్వర్ పుజారా

భారత క్రికెట్‌లో ప్రముఖ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మట్ల నుండి రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 24) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

దేశం తరఫున ఆడటం గర్వకారణమని, కానీ ప్రతి మంచి విషయానికి ఒక ముగింపు ఉంటుందని తన పోస్ట్‌లో పుజారా పేర్కొన్నారు. ఆయన భారత్ తరపున టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ ఆడారు.

తన కెరీర్‌లో 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 7,195 పరుగులు సాధించారు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో తన సహనం, టెక్నిక్‌తో అనేక సందర్భాల్లో భారత జట్టుకు అండగా నిలిచారు. ముఖ్యంగా విదేశీ గడ్డపై ఆడిన కీలక ఇన్నింగ్స్‌లు భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించాయి.

1988 జనవరి 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించిన పుజారా, క్రికెట్ కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి అరవింద్ పుజారా, మామ బిపిన్ పుజారా ఇద్దరూ సౌరాష్ట్ర తరపున రంజీ ట్రోఫీలో ఆడారు. దేశీయ క్రికెట్‌లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పుజారా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 21,301 పరుగులు చేశారు. ఇందులో 66 సెంచరీలు, 81 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2010లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేశారు.

2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో 521 పరుగులు చేసి, సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. టెస్టులతో పాటు ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడిన పుజారా, అందులో 51 పరుగులు చేశారు. 2023లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ ఆడిన తర్వాత ఆయన భారత జట్టులో స్థానం కోల్పోయారు.

దశాబ్దానికి పైగా భారత టెస్ట్ క్రికెట్‌కు సేవలు అందించిన పుజారా, తన సహనం, పట్టుదలతో కూడిన ఆటతీరుకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.

Leave a Reply