30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు.. అమిత్ షా ప్రవేశపెట్టిన సంచలన బిల్లు!

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మూడు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు (Online Gaming Bill), జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) లోక్‌సభలో టేబుల్ చేశారు. ఈ మూడు బిల్లులకు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లుపై గట్టి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిల్లు ప్రకారం, అవినీతి, అక్రమాలు లేదా క్రిమినల్ కేసుల్లో దోషులుగా జైల్లో ఉండే ప్రజాప్రతినిధులు 30 రోజులు జైలులో గడిపిన వెంటనే వారి పదవి రద్దవుతుంది. తీవ్ర నేరారోపణలతో అరెస్టయి శిక్ష అనుభవించే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధాని వరకు ఈ బిల్లు వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరం చేసి 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజునే వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధనల ప్రకారం పదవి ఊడిపోతుంది.

అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు ఆరోపణలతో అరెస్టు అయ్యానని, కానీ నైతిక బాధ్యతగా అప్పట్లో స్వయంగా రాజీనామా చేసానని గుర్తుచేశారు. ఈ బిల్లుపై విపక్షాల విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

ఇక కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని, ఇది దుర్వినియోగానికి దారితీస్తుందని విమర్శించారు. సీఎంలను, మంత్రులను రాజకీయ కారణాలతో అరెస్టు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. అయితే మరో కాంగ్రెస్ నేత శశి థరూర్ మాత్రం ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇది అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ బిల్లును మరింతగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply