ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు సపోర్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని ఈ రోజు ఉదయం జగన్‌కు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. NDA అభ్యర్థికి ఏకగ్రీవ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు, రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. పార్టీ స్థాపననుండి వైసీపీ అటు ఎన్డీఏలోనూ, ఇటు ప్రతిపక్ష కూటమిలోనూ లేని విధంగా ఉంటూనే, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో అధికార పార్టీలకు మద్దతు ఇస్తోంది. గతంలో కూడా వైసీపీ రామ్ నాథ్ కోవింద్, ద్రౌవది ముర్ము ఎన్నికల్లో అధికార బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసింది.
గత పదేళ్లలో బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా, వైసీపీ సన్నిహితంగా ఉండటం ఒక రాజకీయ వాస్తవం. కొందరు కీలక నేతలు, ఎంపీలు పార్టీ మధ్య సమన్వయం చేసేవారని ప్రచారం ఉంది. అయితే, ఈసారి విజయసాయిరెడ్డి వైసీపీని వీడగా, మరో ముఖ్య ఎంపీ మిథున్ రెడ్డి జైలులో ఉన్నారు.
ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన వంటి ప్రధాన పార్టీలు కీలక పాత్రలో ఉన్నప్పటికీ, వైసీపీ అధినేత జగన్ తమ వ్యూహాన్ని పాటిస్తూ ఈ సారి ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఆయన ఓటింగ్‌లో పాల్గొనడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఈసారి ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇండియా కూటమి కూడా అభ్యర్థి నిలిపే అవకాశాన్ని పరిశీలిస్తోంది. నామినేషన్ల ఆఖరి తేదీ ఈ నెల 21, పోలింగ్ సెప్టెంబర్ 9న, అదే రోజు కౌంటింగ్ జరగనుంది.
