వాషింగ్టన్ డీసీ ప్రస్తుతం నేషనల్ గార్డ్స్ ఆధీనంలో ఉంది. అక్కడి శాంతిభద్రతలు క్షీణించాయని, నేరాలు పెరిగాయని కారణంగా వారిని రంగంలోకి దింపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే ఈ చర్యపై ప్రజలు తీవ్రంగా మండిపడుతూ నిరసనలు చేస్తున్నారు.
అమెరికా రాజధానిలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ట్రంప్ ప్రకటించిన అత్యవసర పరిస్థితి, పబ్లిక్ సేఫ్టీ ఎమెర్జెన్సీ కారణంగానే ఈ నిరసనల హోరు మొదలైంది. నేరాలను అరికట్టేందుకు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఫెడరల్ అధీనంలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే డీసీ మేయర్ మురియల్ బౌసర్ మాత్రం 2024లో హింసాత్మక నేరాలు 35%, 2025 ప్రారంభంలో దోపిడీలు 25%, హత్యలు 12% తగ్గాయని వెల్లడించారు. అందువల్ల ఈ చర్య నియంతృత్వంగా ఉందని విమర్శించారు.
ట్రంప్ ఒక్కసారిగా 800 మంది నేషనల్ గార్డులను మోహరించడంతో వాషింగ్టన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే మొదటిసారి కాకపోయినా, ఈసారి సరైన కారణం లేకుండా చేసిన చర్యపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే 14వ స్ట్రీట్లో వాహనాల తనిఖీలు జరుగుతుండగా, ప్రజలు “ఫాసిస్టులారా ఇంటికి వెళ్ళిపోండి” అంటూ నినాదాలు చేశారు.
నేరాల నియంత్రణ పేరుతో వాషింగ్టన్లోని నిరాశ్రయులను కూడా తరలించనున్నట్టు ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ 5,138 మంది నిరాశ్రయ పెద్దలు, పిల్లలు ఉన్నారు. వీరికి నగర బయట భూమి ఇస్తామని, కానీ డీసీని విడిచి వెళ్లాలని చెబుతున్నారు. అయితే ఇది పేదరికాన్ని నేరంగా చూపే ప్రయత్నమని విమర్శకులు అంటున్నారు. ఈ చర్య రాజ్యాంగానికి విరుద్ధమా కాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయినా ట్రంప్ మాత్రం “ఇది వాషింగ్టన్కు స్వేచ్ఛా దినం.. రాజధానిని మళ్లీ నేరరహితంగా మారుస్తాం” అని నొక్కిచెబుతున్నారు. ఇదే సమయంలో నగరంలోని పార్కుల్లో ఉన్న నిరాశ్రయుల శిబిరాలను తొలగించే ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు.