Coolie Movie: రజనీకాంత్ ‘కూలీ’ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన కూలీ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టికెట్‌ ధరలు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ధరల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది.

ఆగస్టు 14న రజనీకాంత్ నటించిన కూలీ, హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా నటించిన వార్-2 సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. పెరిగిన టికెట్‌ ధరలు ఆగస్టు 14 నుంచి 10 రోజులపాటు (ఆగస్టు 23 వరకు) అమల్లో ఉంటాయి. టికెట్‌ ధరల పెంపుతో పాటు, విడుదల రోజున అదనంగా ఒక ప్రత్యేక షో ప్రదర్శించడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన కూలీపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.

భారీ బడ్జెట్‌ చిత్రాలు కూలీ, వార్-2 టికెట్‌ బుకింగ్స్‌ ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్కడ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల ఎదురు చూపులకు తెరపడుతూ, మంగళవారం సాయంత్రం నుంచి బుక్‌మైషో, డిస్ట్రిక్ట్‌ యాప్‌లలో బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో మాత్రం టికెట్‌ ధరల పెంపు లేదు. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్‌ షోకు ముందు కేవలం ఒక స్పెషల్‌ షోకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఆ ప్రత్యేక షో ప్రదర్శించనున్నారు.

హైదరాబాద్‌లోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో కూలీ టికెట్‌ ధర రూ.453 కాగా, వార్-2 సినిమాకు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హైక్‌ అనుమతించింది.

Leave a Reply