Pulivendula ZPTC By Elections: 30 ఏళ్ల తర్వాత సంచలనంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నికలు జరగకుండా ఉండటం, తొలిసారి ఈసారి నిర్వహించబోతుండడంతో పులివెందుల హాట్‌ టాపిక్‌గా మారింది. పులివెందుల అనగానే వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యం గుర్తుకు వస్తుంది. ఇక్కడ వారు చెప్పినదే జరిగే వాతావరణమే ఉంటుంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకూ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు సదా ఏకగ్రీవంగా జరుగుతూ వచ్చాయి. 1995, 2001, 2006, 2021 ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఒక్కటే విజయం సాధించారు. 2016లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ వేసి, తర్వాత వైసీపీలో చేరడంతో ఆ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో వైసీపీ అభ్యర్థి లింగమయ్య 8,500 ఓట్లతో 2,500 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీగా గెలిచారు. ఆ సమయంలో టీడీపీకి కూడా 2,750 ఓట్లు వచ్చాయి.

ఇంతకుముందు 1995, 2001, 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఇక్కడ విజయం సాధించారు. 2021లో వైసీపీ అభ్యర్థి మహేశ్వరరెడ్డి కూడా ఏకగ్రీవంగా గెలిచి జడ్పీటీసీగా ఉన్నారు. కానీ అతని అనుకోని ప్రమాదంలో మరణంతో ఈసారి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉండటంతో, ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ మొదటిసారిగా పులివెందులలో ప్రత్యర్థిగా ఎదురు నిలుస్తోంది. వైసీపీ ప్రధాన నేత జగన్ కంచుకోటను కోల్పోకుండా కాపాడాలని ప్రయత్నిస్తున్నా, టీడీపీ కూడా ఈ స్థానాన్ని తనదిగా చేసుకోవాలనే పట్టుదలతో బలంగా ప్రయత్నిస్తోంది.

ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ మధ్య ప్రతిష్టాత్మకంగా మారాయి. వైసీపీ తన సొంత భూమిలో జెండాను నిలబెట్టుకోవాలని చూస్తున్నా, టీడీపీ మాత్రం పులివెందులపై జెండాను ఎగరవేయాలనే లక్ష్యంతో ఉంది.

పులివెందుల జడ్పీటీసీ పరిధిలో ప్రస్తుతం 10,601 ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి సుమారు 25 శాతం ఓటు బ్యాంకు ఉంది, అంటే దాదాపు 2,600 ఓట్లు మాత్రమే టీడీపీ అనుకూలంగా ఉన్నాయి. 2016లో కూడా టీడీపీకి ఈ మాదిరిగా ఓట్లు వచ్చాయి. అంటే పులివెందులలో టీడీపీకి బలమైన ఆధారం లేదు. కానీ, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ గెలుపుకు కారణమని టీడీపీ నేతలు ఆశావాదంతో ఉన్నారు.

ఈ ఉప ఎన్నికలో మాజీ జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ తరుపున టికెట్ ఇచ్చింది. చనిపోయిన నాయకుల కుటుంబాలకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ప్రకటించింది. టీడీపీ నియమాల ప్రకారం చనిపోయిన నాయకుల కుటుంబ సభ్యులు పోటీలో ఉండరని ఉన్నా, ఈసారి పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిని నిలిపింది. అయితే టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్‌ రవి సతీమణి సింహాద్రిపురం మండలానికి చెందిన వ్యక్తిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇక వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ, జడ్పీటీసీ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో ఎదురు చూస్తున్నారు. టీడీపీ ఈ స్థానాన్ని ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని, వైసీపీ మాత్రం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది.

జగన్ అడ్డాలో వైసీపీ గెలుస్తుందా లేదా ఓటమి చెందుతుందా అనేది ఈ నెల 14న తేలనుంది.

Leave a Reply