నా అంత అనుభవం కేటీఆర్‌కు లేదు.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆకలి కేకలు వినిపించడం మొదలుపెడితే, కేటీఆర్ గ్రామాల్లో తిరగలేరని అన్నారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన బాలరాజు, 2025 ఆగస్టు 10న బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన కేటీఆర్‌పై నేరుగా విమర్శలు చేశారు.
“నా కంటే కేటీఆర్ పెద్దోడేమీ కాదు. ఎదిగిన సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అమెరికాలో చదువుకున్నారు. ఆయనకున్న స్కిల్‌ నాకు ఉండకపోవచ్చు, ఆకట్టుకునే ప్రసంగాలు చేయకపోవచ్చు. కానీ నేను చూసిన ఆకలి మంటలు ఆయన చూడలేదు. నా అంత అనుభవం ఆయనకు లేదు” అని అన్నారు.

అలాగే, ముందుగానే రాజీనామా నిర్ణయం ప్రకటిస్తే వ్యక్తిత్వ హననం జరిగే అవకాశం ఉండేదని, ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా బీఆర్ఎస్‌కు రాజీనామా చేశానని తెలిపారు.

గువ్వల బాలరాజు ఆగస్టు 2న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయని, దళితులకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని ఆరోపించారు.

రాజకీయ ప్రస్థానం:

2009లో మొదటిసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి చెందారు.

2014లో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 11,820 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2018లో మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, 9,441 ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలిచారు.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి చెందారు.

Leave a Reply