Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సరికొత్త రికార్డు బద్దలకొట్టింది..!

ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఒక సరికొత్త ప్రపంచ రికార్డును స్థాపించింది. భారత వాయుసేన చీఫ్ వెల్లడించినట్టు, పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఐదు ఫైటర్ జెట్‌లు మరియు ఒక భారీ విమానాన్ని భారత్ 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసింది. ఇది గగనతల లక్ష్యాన్ని ఇంత దూరం నుంచి ధ్వంసం చేసిన అద్భుతమైన ఘటనం.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పాక్‌పై విరుచుకుపడింది. గతంలో ఇలాంటి రికార్డు నమోదు చేసిన దేశం లేదు. 2024లో ఉక్రెయిన్ ఒక నిఘా విమానాన్ని 200 కిలోమీటర్ల దూరంలో నుండి కూల్చివేసింది. అయితే, భారత్ ఈసారి 300 కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా రికార్డును బద్దలకొట్టింది.

ఈ విజయానికి ప్రధాన కారణం రష్యా తయారు చేసిన ఆధునిక ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ. ఈ వ్యవస్థ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను భారీ దూరం నుంచి కూడా సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు. ఇందులో వాడే 40ఎన్6 క్షిపణి 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలదు.

భారత్ 2018లో రష్యాతో 543 కోట్ల డాలర్ల ఒప్పందం ద్వారా ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసింది. వాటిలో మూడు వ్యవస్థలు ఇప్పటికే దేశానికి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో ఈ వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయి. ఇలాంటి ఆధునిక ఆయుధాల కారణంగానే పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దులకు దూరంగా ఉండిపోయాయి.

అదేవిధంగా, ఎస్-400 వ్యవస్థ శత్రు దేశాల జామింగ్ ప్రయత్నాలను నిరోధించగలదు. దీని వల్ల భారత్ భవిష్యత్తులో కూడా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించగలదని భావిస్తున్నారు.

Leave a Reply