Telangana: తెలంగాణ మహిళలకు బంపర్ ఆఫర్.. ఉచిత బస్సు డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా, రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా బస్సు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. మహిళలు రవాణా రంగంలో కూడా రాణించాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రేరణగా తెలంగాణ తొలి మహిళా ఆర్టీసీ బస్ డ్రైవర్ అయిన సరితను ఆదర్శంగా తీసుకున్నారు.

ఈ శిక్షణను పేదరిక నిర్మూలన సంస్థ (SERP) మరియు స్వచ్ఛంద సంస్థ MoWo సహకారంతో నిర్వహించనున్నారు. అర్హత సాధించిన మహిళలకు ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇటీవల మంత్రి సీతక్క ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ శిక్షణలో పాల్గొనదలచిన మహిళలు కొన్ని అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది:

అర్హతలు:
వయస్సు: 21 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి

విద్యార్హత: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత

నివాసం: తెలంగాణ రాష్ట్ర నివాసి కావాలి

ఆధార్ కార్డు: తెలంగాణలో జారీ అయి ఉండాలి

ఎత్తు: కనీసం 160 సెం.మీ

శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి

శిక్షణ వ్యవధి: 3 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది

ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూలు టెలిఫోన్ లేదా ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. ఎంపికైన వారికి 3 నెలల డ్రైవింగ్ శిక్షణతో పాటు, అనంతరం 6 నెలల సాఫ్ట్ స్కిల్స్ మరియు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. చివరగా ఇంటర్న్‌షిప్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ‘‘మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా, గౌరవంగా జీవించేందుకు ఇది దోహదపడుతుంది. సరిత నాయక్‌ను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం’’ అని తెలిపారు.

సరిత నాయక్ ఎవరు?
యాదాద్రి భువనగిరి జిల్లా, సీత్యా తండాకు చెందిన సరిత చిన్నతనంలోనే చదువు మానేసి ఆటో నడిపడం ప్రారంభించారు. తర్వాత హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన ఆమె ఢిల్లీలో 10 ఏళ్లపాటు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేశారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో స్వస్థలానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలసి, తెలంగాణ ఆర్టీసీలో అవకాశం పొందారు. ఆమె ఇప్పుడు రాష్ట్ర తొలి మహిళా బస్ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు.

Leave a Reply