Urvashi Rautela: ఊర్వశి రౌతేలాకు బిగ్ షాక్.. రూ.70 లక్షల నగలు దొంగల చేతిలోకి..!

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు లండన్ ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని షాక్ తగిలింది. వింబుల్డన్ టోర్నీ ముగించుకుని భారత్ తిరిగొస్తుండగా, ఆమె లగ్జరీ సూట్‌కేస్‌ చోరీకి గురైంది. గాట్‌విక్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు పోయినట్లు ఊర్వశి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు స్పందించకపోవడంతో ఊర్వశి తీవ్రంగా నిరాశ చెందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన ఆమె, ఎమిరేట్స్, వింబుల్డన్ అధికారులను ట్యాగ్ చేస్తూ సహాయం కోరారు. జూలై మొదటివారంలో జరిగిన వింబుల్డన్ మహిళల ఫైనల్ మ్యాచ్‌కు ఊర్వశి హాజరైన సంగతి తెలిసిందే.

ఊర్వశి గతంలోనూ ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. 2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఆమె రూ.45 లక్షల విలువైన చెవిపోగు పోగొట్టుకున్నట్లు ఆమె బృందం వెల్లడించింది. అంతేగాక, గతంలో తన ఐఫోన్ కూడా దొంగిలించబడినట్లు ఆమె వెల్లడించారు. ఈ వరుస ఘటనలు ఊర్వశి అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లండన్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రస్తుతం ఊర్వశి రౌతేలా బాలీవుడ్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ బిజీగా మారారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ఆ పాటకు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ రావడం, ఊర్వశికి తెలుగు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

తర్వాత నందమూరి బాలకృష్ణ డాకు మహరాజ్ చిత్రంలో SI జానకి పాత్రలో నటించిన ఆమె, ‘దబిడి దిబిడి’ పాటలో బాలయ్యతో స్టెప్పులేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయం ఆమెకు మంచి బ్రేక్‌గా నిలిచింది.

ప్రస్తుతం ఊర్వశి తెలుగు సినిమాల్లో మంచి డిమాండ్ తెచ్చుకున్నారు. కేవలం ఐటెం సాంగ్స్‌నే కాదు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న రోల్స్‌కూ అవకాశాలు వస్తున్నాయి. రామ్ పోతినేని నటిస్తున్న “ఆంధ్రా కింగ్” సినిమాలో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న “డ్రాగన్” చిత్రంలో ఊర్వశి కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply