చిరంజీవి బర్త్‌డేకు పవన్ అభిమానులకు గిఫ్ట్..? ‘హరిహర వీరమల్లు’ ఓటీటీలోకి వస్తోంది..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇటీవలే జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందన పొందింది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టినప్పటికీ, టాక్ విషయంలో మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ ఎదురయ్యింది.

తెలుగు వెర్షన్ ప్రీమియర్ షోలతో కలిపి దాదాపు రూ.12.75 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు కలెక్షన్ రూ.34.75 కోట్ల వరకు దక్కింది. మొదటి ఐదు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ దాదాపు రూ.75 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ డే తర్వాత నుంచే కలెక్షన్లు తగ్గిపోవడం చిత్ర యూనిట్‌ను కాస్త ఆందోళనకు గురి చేసింది.

పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నా, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో గ్రాఫిక్స్, సీజీఐ యానిమల్స్ పై ట్రోల్స్ వెల్లువెత్తాయి. స్క్రీన్‌ప్లే సరిగా సాగలేదని, కథనం అస్తవ్యస్తంగా ఉందని ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక సినిమాకు సంబంధించిన ఓటీటీ వార్తలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు పొందినట్టు సమాచారం. సినిమా థియేటర్లలో విడుదలైన 4 నుండి 8 వారాల్లోగా ఓటీటీలోకి రానుంది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘హరిహర వీరమల్లు’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా పవన్ ఫ్యాన్స్‌కు ఇది సర్‌ప్రైజ్ గిఫ్ట్ కావొచ్చని అందరూ భావిస్తున్నారు.

Leave a Reply