Buddha relics: 127 ఏళ్ల తర్వాత బుద్ధుడి పవిత్ర అవశేషాలు భారత్‌కు తిరిగొచ్చాయి!

బ్రిటిష్ వలస పాలన కాలంలో భారత్‌ నుంచి తరలించబడిన బుద్ధుని పవిత్ర అవశేషాలు, 127 ఏళ్ల అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఈ అవశేషాల తిరిగివస్తున్న సందర్భాన్ని ఆయన “మన సాంస్కృతిక వారసత్వానికి గొప్ప రోజు”గా పేర్కొన్నారు.

1898లో ఉత్తరప్రదేశ్‌లోని పిపర్‌హవా ప్రాంతంలో తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన ఈ బుద్ధ అవశేషాలను బ్రిటీష్ ప్రభుత్వం వలస పాలన సమయంలో భారతదేశం నుంచి తరలించింది. అయితే, ఇటీవల ఓ అంతర్జాతీయ వేలంలో ఇవి ప్రత్యక్షమవడంతో, భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వాటిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది.

మోదీ ట్వీట్‌లో ఏముందంటే..
“పవిత్ర బుద్ధ అవశేషాలు తిరిగి మన దేశానికి రావడం ఎంతో గర్వకారణం. ఇవి గౌతమ బుద్ధుని బోధనలు, భారత సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెబుతాయి. సంస్కృతిని పరిరక్షించాలన్న మన నిబద్ధతకు ఇవి సంకేతం,” అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఈ పని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పిపర్‌హవా అవశేషాల వెనుక చరిత్ర
1898లో భారత-నేపాల్ సరిహద్దు వద్ద పిపర్‌హవాలో జరిగిన తవ్వకాల్లో ఓ బౌద్ధ స్తూపం లోపల రాతిపెట్టెలో అస్థి అవశేషాలు, బంగారు ఆభరణాలు, రత్నాలతో కూడిన పేటికలు బయటపడ్డాయి. అవి బుద్ధునికి చెందినవిగా గుర్తించడంతో, ఆ సమయంలో అవి సియామ్ (ప్రస్తుత థాయ్‌లాండ్‌) రాజుకు పంపించబడ్డాయి. ప్రస్తుతం ఈ రాతిపెట్టె కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉందని సమాచారం.

Leave a Reply