Donald Trump: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబు.. 25% దిగుమతి సుంకం తప్పదన్న హెచ్చరిక!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను అమెరికాకు స్నేహపూర్వక దేశంగా అభివర్ణించినప్పటికీ, గనక వ్యాపార ఒప్పందం కుదరకపోతే భారత్‌ దిగుమతులపై 20 నుండి 25 శాతం టారిఫ్‌లు విధించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇటీవల స్కాట్లాండ్ పర్యటన అనంతరం వాషింగ్టన్ వెళ్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, భారత్‌పై దిగుమతి సుంకాలు విధించే అవకాశం ఉందని తెలిపారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ అమెరికాపై అధికంగా సుంకాలు వేస్తుందని, ఇది సమంజసం కాదని స్పష్టం చేశారు.

అమెరికా-భారత్ మధ్య సుంకాల చర్చలు

ఇరు దేశాల మధ్య ఇప్పటికే టారిఫ్‌లపై పలుమార్లు చర్చలు జరిగాయి. మొదటగా ఏప్రిల్ 2న డెడ్‌లైన్ ప్రకటించిన ట్రంప్, తర్వాత జూలై 9కి మార్చి చివరికి ఆగస్టు 1గా నిర్ణయించారు. ప్రస్తుతం ఆ గడువు ముగియడానికి కేవలం ఒకరోజే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారి బృందం భారత్‌కు వచ్చే నెలలో రానుంది. వారి పర్యటనలో స్పష్టత రానుందని తెలుస్తోంది.

ప్రపంచ దేశాలపై దాడి చేస్తున్న ట్రంప్ టారిఫ్‌లు

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధిస్తున్నారు. ఇప్పటికే ఇండోనేషియా, యూకే, ఫిలిప్పీన్స్, జపాన్‌ దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ భారత్‌తో మాత్రం ఇంకా మొదలు కాలేదు. ట్రంప్ వ్యాఖ్యలతో చూస్తుంటే ఈసారి భారత్‌పై కూడా భారీ టారిఫ్‌లు పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

Leave a Reply