ఏపీలో వాళ్లందరికీ రూ.10వేలు ఆర్థిక సాయం.. మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు మంచి వార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.

ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు కానున్న నేపథ్యంలో, ఆటో డ్రైవర్ల ఆదాయానికి భంగం కలగకుండా ఉండేందుకు ఈ ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించాలని భావించినప్పటికీ, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రి నారా లోకేష్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

అదే సమయంలో రైతులకు కూడా భారీ స్థాయిలో ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద మూడు విడతల్లో రూ.20వేలు చెల్లించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

ఇక ఏపీ అభివృద్ధిపై మంత్రి మరో కీలక వ్యాఖ్య చేశారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సందర్భంగా పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, గతంలో వైసీపీ పాలనలో వెనక్కి వెళ్లిపోయిన కంపెనీలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. విశాఖను ఫైనాన్షియల్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని, 20 లక్షల ఉద్యోగాల టార్గెట్‌తో ముందుకెళ్తున్నామని తెలిపారు.

Leave a Reply