BRS – BJP విలీనం కోసం కేటీఆర్ అడిగాడా? గుండె మీద చేయి వేసి చెప్పు: సీఎం రమేష్

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితపై విచారణ ఆపితే, బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ అనలేదా? అని నిలదీశారు. విలీనం కోసం మీరు మా ఇంటికి రాలేదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కోరిక మేరకే బీజేపీ పెద్దలను తాను కలిశానని రమేష్ తెలిపారు. కానీ బీజేపీ, “ఇప్పటికే బలహీనమైన బీఆర్ఎస్ మాకు అవసరం లేదు” అని తిరస్కరించిందని చెప్పారు. ఇదే విషయాన్ని కేటీఆర్‌కు కూడా చెప్పానని, ఇది నిజం కాదని కేటీఆర్ గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా? అని సవాల్ విసిరారు.

అలాగే, “టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సిరిసిల్లాలో కేవలం 300 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎలా గెలిచావో కూడా చెప్పగలవా?” అని ప్రశ్నించారు. అనకాపల్లిలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రమేష్ స్పష్టం చేశారు. తెలంగాణలో రుత్విక్ కంపెనీకి రూ.1660 కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని, అందులో తాను లాభం పొందినట్టుగా కేటీఆర్ ఆరోపించడం మూర్ఖత్వమన్నారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి కాంట్రాక్టులు తెచ్చుకున్నాననడం తప్పు. ఆ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు పాటించే నిబంధనలు పది ఏళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్‌కి తెలియదా?” అని రమేష్ కౌంటర్ ఇచ్చారు.

ఇక కేటీఆర్‌ను ఉద్దేశించి, “ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. నన్ను అనవసరంగా కెలికితే ఇంకా చాలా నిజాలు బయటపెట్టాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని, అవి ఎవరికి వెళ్లాయో, అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది, ఆంధ్ర వాళ్లు ఎంతమంది అన్న పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని సీఎం రమేష్ వెల్లడించారు.

Leave a Reply