రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లు ఇకపై అల్పాహారం (టిఫిన్) కూడా అందించనున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచే ఉదయం టిఫిన్ వడ్డించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం రూ.5 భోజనం అందిస్తున్న కేంద్రాల్లోనే అల్పాహారం కూడా అందుబాటులో ఉండనుంది.
అయితే, ప్రస్తుత క్యాంటీన్ నమూనాను కూడా జీహెచ్‌ఎంసీ మార్చుతోంది. 40/10, 20/10 పరిమాణాలతో కొత్త డిజైన్ సెంటర్లు రూపొందిస్తున్నారు. విస్తీర్ణం ఎక్కువగా ఉంటే వడ్డించుకునేందుకు, తినేందుకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ కొత్త నమూనాను ఏర్పాటు చేశారు.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కొత్త క్యాంటీన్ పనులు తుది దశలో ఉన్నాయి. కొత్త నమూనాలో జీహెచ్‌ఎంసీ లోగో, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలతో పాటు భోజనం, అల్పాహారం ఫొటోలు ఉంటాయి. గతంలో డివిజన్‌కి ఒక్కటి చొప్పున 150 భోజన కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 128 కేంద్రాలు పనిచేస్తున్నాయి.
ఏం వడ్డిస్తారు?
లబ్ధిదారులకు అల్పాహారంగా మిల్లెట్‌తో చేసిన ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి వంటివి అందిస్తారు. వారంలో ఆరు రోజులు టిఫిన్ అందుబాటులో ఉంటుంది. ఆదివారం మాత్రం సెలవు. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చవుతుంటే, లబ్ధిదారుడు కేవలం రూ.5 మాత్రమే చెల్లించాలి. మిగతా రూ.14ని హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కి జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుంది.
రోజువారీ మెనూ (గ్రా – గ్రాములు, ఎంఎల్ – మిల్లీ లీటర్లు)
డే 1: మిల్లెట్ ఇడ్లీ 3 (ఒక్కొక్కటి 45గ్రా), సాంబార్ 150ఎంఎల్, పొడి 15గ్రా
డే 2: మిల్లెట్ ఉప్మా 250గ్రా, సాంబార్ 150ఎంఎల్, మిక్చర్/చట్నీ 25గ్రా
డే 3: పొంగల్ 250గ్రా, సాంబార్ 150ఎంఎల్, మిక్చర్ 25గ్రా
డే 4: ఇడ్లీ 3 (ఒక్కొక్కటి 45గ్రా), సాంబార్ 75ఎంఎల్, చట్నీ 75గ్రా
డే 5: పొంగల్ 250గ్రా, సాంబార్ 150ఎంఎల్, మిక్చర్ 25గ్రా
డే 6: పూరి 3 (45గ్రా), ఆలూ కూర్మ 100గ్రా