చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై చీటింగ్ కేసు పెట్టాలి.. రోజా సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి రోజా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లో వేసి, దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను అమలు చేయకపోయి, అన్ని చేశామంటూ మాట్లాడటం సిగ్గుచేటని ఆమె దుయ్యబట్టారు.

ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ ఇద్దరూ సంతకాలు చేసినా, వాగ్దానాలను అమలు చేయలేకపోయారని రోజా మండిపడ్డారు. అమలు చేయడం కష్టమని తెలుసుకుని BJP దూరంగా నిలిచిందని అన్నారు. సంతకం చేసి మోసం చేస్తే అది చీటింగ్ కాదా? అని ప్రశ్నించారు. అందుకే ఇద్దరిపై కూడా 420 చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

రైతులను, మహిళలను, చిన్నపిల్లలను కూడా మోసం చేసిన వారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లేనని ఆమె విమర్శించారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌నే అమ్మేయాలన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఈ విషయాలు తెలియకపోవడం ఎలా? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే దొంగ మేనిఫెస్టో ఇచ్చారని రోజా ఆరోపించారు.

Leave a Reply