Yash Dayal: RCB స్టార్ బౌలర్‌పై పోక్సో కేసు.. రెండేళ్లుగా అత్యాచారమంటూ ఫిర్యాదు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బౌలర్ యశ్ దయాల్ వరుస లైంగిక ఆరోపణలతో పెద్ద సమస్యల్లో చిక్కుకున్నాడు. క్రికెట్ మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యువ పేసర్‌పై తాజాగా జైపూర్‌కి చెందిన ఓ యువ క్రీడాకారిణి అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు.

జైపూర్‌కు చెందిన యువ క్రీడాకారిణి తెలిపిన వివరాల ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా యశ్ దయాల్‌ను తొలిసారి కలిశానని, తన క్రికెట్ కెరీర్‌కి సహాయం చేస్తానని నమ్మబలికి సీతాపురలోని ఓ హోటల్‌లో లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మొదటిసారి ఈ దాడి జరిగినప్పుడు ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే కావడంతో, పోక్సో చట్టం ప్రకారం జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదే సమయంలో, ఘాజియాబాద్‌కు చెందిన మరో యువతి కూడా యశ్ దయాల్‌పై ఆరోపణలు చేసింది. తనను ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగికంగా, మానసికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆరోపణలను యశ్ దయాల్ ఖండించాడు. అనంతరం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, అతడిని అరెస్ట్ చేయకూడదంటూ తాత్కాలిక స్టే ఇచ్చింది.

ఈ వరుస లైంగిక ఆరోపణలతో యశ్ దయాల్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలు నిజమని రుజువైతే, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చిన యశ్ దయాల్, ఆ సీజన్‌లో 11 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ చేసి.. మొత్తం 13 వికెట్లు తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ విజయాల ఆనందం నిలవకముందే, లైంగిక ఆరోపణలతో అతడి కెరీర్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply