ఈ రోజు విడుదలైన హరిహర వీరమల్లు సినిమాపై సీపీఎం నేతలు భగ్గుమన్నారు. చారిత్రక ఆధారాలు లేని ఊహాజనిత కథతో సినిమా తీశారని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, సినిమా హీరో పవన్ కల్యాణ్‌కు ఆయన గురువారం ఓ లేఖ రాశారు.
“హరిహర వీరమల్లు చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడకుండా ఊహాజనితంగా తీశారు. కానీ పవన్ అభిమానులు, ప్రజలు దీన్ని నిజమైన చారిత్రక సంఘటనగా భావిస్తున్నారు. ఈ చిత్రం అపోహలు సృష్టించి ముస్లింలపై విద్వేషాలు పెరగడానికి దారి తీసే అవకాశం ఉంది. ఇది జాతీయ ఐక్యతకు, సమగ్రతకు తోడ్పడే విషయం కాదు. ఈ సినిమా కేవలం కాల్పనిక కథ అని ప్రజలకు స్పష్టం చేయాలి” అని ఆయన పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నిజాలు చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. “హరిహర వీరమల్లు అనే పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటి వాస్తవాలకు కట్టుకథలు జోడించడం వల్ల చరిత్రపై అపోహలు వస్తాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం మొదట కాకతీయుల పాలనలో ఉండేది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, నాదిర్ షా, ఆఫ్ఘనిస్తాన్ రాజులు, పంజాబ్ సిక్కు రాజులు, చివరకు బ్రిటిష్ వారికి చేరింది. బ్రిటిష్ వారు దానిని లండన్ తరలించారు. అది తిరిగి భారతదేశానికి రాలేదు” అని వివరించారు.
“సినిమాలో బ్రిటిష్ వారి పాత్రను ప్రస్తావించకపోవడం బాధాకరం. మొఘలుల కాలంలో సంపద ఇక్కడే ఉండిపోయింది, కానీ బ్రిటిష్ వారు మన సంపదను పూర్తిగా తరలించారు. హిందూ-ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్లిపోయింది బ్రిటిష్ వాళ్లే. ఈ చారిత్రక వాస్తవాన్ని పవన్ గుర్తించాలి. దేశభక్తి గురించి 11 ఏళ్లుగా మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కూడా కోహినూర్ వజ్రాన్ని తిరిగి రప్పించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పవన్ కల్యాణ్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారత్‌కి రప్పిస్తే ప్రజలు సంతోషిస్తారు. కానీ కట్టుకథలతో మత విద్వేషాలు రగిలించడం దేశానికి నష్టం” అని సీపీఎం నేత వ్యాఖ్యానించారు.