Rajeev Kanakala: రాజీవ్‌ కనకాలకు బిగ్‌ షాక్‌.. రాచకొండ పోలీసుల నోటీసులు!

సినీనటుడు రాజీవ్‌ కనకాలకు ఊహించని షాక్‌ తగిలింది. ఫ్లాట్ల విక్రయ వివాదంలో ఆయనకు రాచకొండ పోలీసులు నోటీసులు పంపించారు. అలాగే సినీ నిర్మాత విజయ్‌ చౌదరిపై హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కొన్ని నెలల క్రితం రాజీవ్‌ కనకాల తన ఫ్లాట్‌ను నిర్మాత విజయ్‌ చౌదరికి విక్రయించారు. అనంతరం విజయ్‌ ఆ ఫ్లాట్‌ను మరో వ్యక్తి శ్రవణ్‌ రెడ్డికి రూ.70 లక్షలకు అమ్మేశాడు. అయితే ఆ ఫ్లాట్‌ అసలు లేనిదని, ఉన్నట్లు చూపించి మోసం చేశారని బాధితుడు ఆరోపించాడు.

హయత్‌నగర్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 421లో రాజీవ్‌కి ఉన్న ఫ్లాట్‌ను విజయ్‌ రిజిస్ట్రేషన్‌ చేసి శ్రవణ్‌కి అమ్మేశాడు. కానీ ఏడాది క్రితం శ్రవణ్‌ ఆ ఫ్లాట్‌ను చూసుకునేందుకు వెళ్లగా, సదరు నంబర్‌ ఫ్లాట్‌ అసలు లేకుండా మొత్తం ఆనవాళ్లు చెరిగిపోయాయని గుర్తించాడు.

దీనిపై విజయ్‌ చౌదరిని సంప్రదించగా, “ఫ్లాట్‌ ఇవ్వను, వివాదం నడుస్తోంది, మాట్లాడుకుందాం” అంటూ తప్పించుకున్నాడు. తర్వాత “మీ అంతు చూస్తా” అంటూ బెదిరించాడని శ్రవణ్‌ హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌ చౌదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఫ్లాట్‌ విక్రయదారుడు, సినీనటుడు రాజీవ్‌ కనకాలకు కూడా పోలీసులు నోటీసులు పంపించారు.

Leave a Reply